Online Puja Services

లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చే స్కాందపురాణాంతర్గతమైన స్తోత్ర కథనం .

3.143.9.115

లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చే స్కాందపురాణాంతర్గతమైన స్తోత్ర కథనం . 
- లక్ష్మి రమణ 

వేద వాగ్మయం ఎంతటి విస్తృతంగా ఉందో, పురాణ వాగ్మయం కూడా అంటే విస్తృతంగా ఉంది . వేదం చెప్పే ధర్మం నిగూఢంగా, అర్థం చేసుకోవడానికి కాస్త సంక్లిస్టముగా అనిపిస్తుంది . పురాణాలు అదే ధర్మాన్ని చక్కని కథలుగా వివరిస్తాయి . అర్థం చేసుకోవడం, మనసుని అటువంటి ఉదంతాలతో కూడిన పరమేశ్వరుని మీద నిలపడం ధర్మానుసరణీయులకి  సులువవుతుంది. సినిమా చూసినప్పుడు అందులోని కథానాయకుడి ఉదాత్త లక్షణాలు మన మనసుపై చెరగని ముద్ర వేస్తాయి కదా! తిరిగి తిరిగి ఆ పాత్రని గుర్తుకి తెస్తాయి కదా ! అలాగన్నమాట.  పురాణాల లో మనము అనుసరించాల్సిన ధర్మాలతో పాటు పూజా స్తోత్రాలనూ , విధానాలనూ కూడా ఋషులు నిర్దేశించారు .  అటువంటి ఒక దివ్యమైన లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చే స్తోత్రాన్ని గురించి ఇక్కడ చెప్పుకుందాం .  

పూర్వం దూర్వాస మహర్షి  వల్ల శపించబడినటువంటి లక్ష్మీ,నారాయణలు వైకుంఠాన్ని వదిలి భూలోకంలో కాంచన పద్మం అనే సరస్సు దగ్గర నివాసాన్ని ఏర్పరచుకున్నారు.  ఈ సరోవరం దగ్గరే లక్ష్మీదేవి పదివేల దివ్య సంవత్సరాల పాటు తపస్సులో మునిగిపోయింది.  అక్కడ వైకుంఠంలో లక్ష్మీనారాయణలు కనపడక దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు. వారి కోసం అన్ని లోకాలు వెతికి ఇంద్రుడితో సహా అందరూ కూడా ఈ సరోవరం దగ్గరికి వచ్చారు. అక్కడ బంగారుకమలములో శ్రీహరితో కలిసి చిద్విలాసంగా ఉన్న లక్ష్మీదేవిని దర్శించి ఎంతో ఆనందించారు.  లోకాలకు తల్లి అయిన ఆ అమ్మని ఇంద్రాది దేవతలు ఇలా స్తుతించారు. 

లక్ష్మీ దేవి స్తుతి 

నమః శ్రియ్యై  లోకదాత్రై బ్రహ్మమాత్రే నమో నమః | 
నమస్తే పద్మ నేత్రాయై పద్మముఖ్యై నమః || 

నమో ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమో నమః | 
విచిత్రక్షేమ ధారిణ్యై పృథుశ్రోణ్యై  నమో నమః || 

పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమో నమః|    
సురక్త పద్మ పత్రాభా కరపాదతలే శుభే  || 

సురక్తాంగద కేయూర కాంచీ నూపుర శోభితే | 
యక్షకర్థమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే || 

 మాంగల్యా భరనై: శ్చిత్రై:  ముక్తాహారై ర్విభూషితే| 
తాటంకైర వతంసైశ్చ శోభామాన ముఖాంబుజే || 

పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే| 
ఋగ్యజు : సామరూపాయ విద్యాయతే నమో నమః || 

ప్రసీదాస్మాస్కృపా దృష్టిపాతై రాలోకాయాబ్ధిజే | 
ఏ దృష్టా స్తే త్వయా బ్రహ్మరురుద్రేమ్ద్రత్వం సమవాప్నియుః||  

సురారీ న్సహాసా  హత్వా స్వపదాని గమిష్యథ | 
యే  స్థానహీనాః స్వస్థానాద్ర్భంశితా యే నరా భువి||  

తే మామనేన స్తోత్రేణ  స్తుత్వా స్థానమావాప్నుయుః | 
అఖండై ర్బిల్వవత్రై ర్మామార్చయంతి నారా భువి|| 

స్తోత్రేణానేన యే  దేవా నారాయుష్మత్కృతేన వై | 
ధర్మార్థకామ మోక్షేణా  మకారాస్తే భవంతివై|| 

ఇదం పద్మసరో దేవా యే కేచన నరా భువి | 
ప్రాప్య స్నానం కరిష్యంతి మాం స్తుత్వా  విష్ణు వల్లభామ్|| 

తేపి శ్రియం దీర్ఘమాయుర్విద్యాం పుత్రాన్సువర్చసః | 
లాబ్ద్వా భోగాంశ్చ భుక్త్వాన్తే  నరా మోక్షమవాప్నుయుః ||  

ఇతి దత్వా వరం దేవీ  దేవేన సహ విష్ణునా| 
 ఆరుహ్య  గరుడేశానం వైకుంఠ వైకుంఠస్థానమాయయౌ||  

భావం :  

ఓ లోకమాతా ! బ్రహ్మ మాతా ! పద్మ నేత్ర, పద్మముఖీ!  నీకు నమస్కారము.  ప్రసన్నమైన ముఖ పద్మము కలదానా! పద్మ కాంతి తో ప్రకాశించే అమ్మ, బిల్వ వనములలో నివసించేటటువంటి దానా, ఓ విష్ణు పత్ని తల్లి నీకు నమస్కారము.  విచిత్రమైన పట్టు వస్త్రములు ధరించి, విశాలమైన జఘన స్థలము కలిగి, పండిన మారేడు పండు వంటి దృఢమైన ఉన్నతమైన స్థనములు కలిగినటువంటి ఓ దేవదేవి అమ్మ నీకు నమస్కారము.  ఎర్ర తామరల వంటి పాదములు కలిగిన ఓ శుభాంగి, కేయూరములు కాంచీనూపురముల చేత ప్రకాశించేటటువంటి అమ్మ ! యక్షకుర్ధమమును  శరీరమంతటా కూడా అలదుకున్నటువంటి దేవి, కటకముల చేత ఉజ్వలముగా ఉన్నటువంటి మాత, మాంగల్యము మొదలైనటువంటి వివిధములైన ఆభరణములు చేత, ముత్యాల హారముల చేత అలంకరించబడినటువంటి లక్ష్మీ!  చెవి కమ్మల చేత, శిరోభూషణముల చేత ప్రకాశించుచున్నటువంటి పద్మము వంటి ముఖము కలిగిన అమ్మ నీకు నమస్కారం.  పద్మములను హస్తముల యందు ధరించినటువంటి దేవదేవి నీకు నమస్కారము.  హరికి ఎంతో ఇష్టమైనటువంటి  హరివక్షస్థలంలో నివసించే లక్ష్మీ మాత నీవు ఋక్కు యజస్సు సామ విద్యల స్వరూపము.  అమ్మ నీకు నమస్కారము.  

మమ్మల్ని కాపాడు సాగరంలో జన్మించినటువంటి మాత..  నీ కృపా కటాక్షాలతో మమ్మల్ని వీక్షించు.  నీ చూపులు పొందిన వారు బ్రహ్మత్వాన్ని ఇంద్రత్వాన్ని రుద్రత్వాన్ని కూడా పొందుతున్నారు.  అని ఆ దేవతలంతా కూడా అమ్మవారిని స్తుతించారు. 

స్కాంద పురాణంలోని 9దవ అధ్యాయంలో చెప్పిన ఈ లక్ష్మీ దేవి ప్రార్థన  ప్రతి రోజూ చేసుకొంటే ధన ధాన్యాలకీ, ఆయురారోగ్యాలకీ సుఖశాంతులకీ కొదవుండదు. చక్కని యశస్సు కలిగిన పుత్రపౌత్రులతో వర్ధిల్లుతారు . అంత్యాన ఆ వైకుంఠ వాసాన్ని పొందగలరు . 

శుభం . 

Lakshmi Devi, Mahalakshmi, Adilakshmi, Stotram

#lakshmi #lakshmidevi #mahalakshmi #adilakshmi #stotram

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda